వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి

వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి

వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి  నేటి విధానాలు,  పద్ధతులు వ్యవసాయ రంగాన్ని అస్థిరపరుస్తున్నాయి.  ప్రపంచంలో  పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా  ఆహార ఉత్పత్తులను పెంచి  ఆకలిని అరికట్టడం,  మరోవైపు  సాగుభూమి ఆరోగ్యాన్ని  కాపాడటం.. ఈ రెండు అంశాలు  ప్రపంచ మానవాళి ముందున్న ప్రధాన సవాళ్లు.  వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను పెంచడానికి నేడు రైతులు అధికంగా రసాయనిక ఎరువులను వాడటం వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతోంది.  

ఈ పరిణామం  మానవుల ఆరోగ్యానికి  ప్రమాదకరంగా పరిణమించింది.  ఐక్యరాజ్యసమితి  సుస్థిర  అభివృద్ధి లక్ష్యాలలో 17 లక్ష్యాలు, 169  టార్గెట్స్ ఉన్నాయి.  ఇందులో   నెంబర్ 2 లక్ష్యం - ఆకలిని పూర్తిగా నివారించడం,  నెంబర్ 15- భూమిపై జీవ మనుగడను రక్షించడం..  ఈ లక్ష్యాలను  ప్రవేశపెట్టి  9 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ  ఇంకా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించకపోగా మరింత పెంచడం జరుగుతోంది.


వ్య  వసాయ రంగం సుస్థిర  అభివృద్ధి  అనేది ఈ భూగోళంపై ఉన్న సమస్త జీవులకు ఎంతో అవసరం.   వ్యవసాయం లేకుండా ఆహారం లేదు, భూసారం- లేకుండా వ్యవసాయాన్ని కూడా ఊహించలేం.   నేడు  పెరుగుతున్న జనాభా అవసరాల కోసమనో,  అధిక ఉత్పత్తులు కోసమనో  పంటల్లో పరిమితికి మించి  అధికంగా రసాయనిక ఎరువులను వాడుతున్నాం.  దీనివల్ల  భూమి పొరల్లో ఉన్న అతి ముఖ్యమైన పోషకాలను  లేకుండా చేస్తున్నాం.   దీంతో భూమి సహజ సిద్ధమైన ఉత్పత్తి శక్తిని కోల్పోతూ పర్యావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావానికి కారణం  ఒక్క వ్యవసాయ రంగమే 37%  వరకు  ఉంటుందని ఒక అంచనా.  

పెరుగుతున్న జనాభాకు ఆహారోత్పత్తి, మానవ ఆరోగ్యం కీలకం

ప్రపంచంలోని స్వచ్ఛమైన నీటిని  వ్యవసాయ రంగానికి 70%  వరకు ఉపయోగించబడుతుంది.  వ్యవసాయ ఉత్పత్తులను ఎలాగైనా పెంచాలని  ఉద్దేశపూర్వక  వ్యవసాయ పనుల వల్ల  40%  పైగా ప్రపంచవ్యాప్తంగా భూసారం కోల్పోయినట్లు ఒక అంచనా.  వచ్చే 2050 వరకు  ప్రపంచ జనాభా 10 బిలియన్లు ( 1000 కోట్లకు)  చేరుకుంటుందని జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అయితే  ఈ జనాభా అవసరాల మేరకు  ఆహార ఉత్పత్తులను చేస్తున్న క్రమంలో  మానవాళి పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రస్తుతం ప్రతి ఏటా  ప్రపంచ వ్యాప్తంగా  2  మిలియన్లు( 20  లక్షలు)  మంది ప్రజలు ఆహారం దొరకక మృత్యువాతపడుతున్నారు. అలాగే 80 మిలియన్లు( 8  కోట్ల ) మంది ప్రజలపై ష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.  ప్రధానంగా ఈ సమస్య స్వల్ప ఆదాయ దేశాల్లో అధికంగా కనిపిస్తోంది. అధికంగా ఉపయోగించబడే రసాయనిక  ఎరువులు, మందుల వల్ల  ఒక్క ఆరోగ్యం పై కూడా తీవ్రమైన ప్రభావం పడుతోంది.   అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ అనేదానికి కారణమవుతోంది.  

ఉత్పత్తితో పాటు భూమి ఆరోగ్యమూ బాగుండాలి

భూసారం,భూ ఆరోగ్యం  నేడు ప్రపంచ మానవాళికి అతి ముఖ్యమైన అంశం.  దీనిపై వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు విధానాలను రూపకల్పన చేసేవారు వాటిని అమలు చేసే అధికార యంత్రాంగము మొదలుకొని క్షేత్రస్థాయిలో రైతుల వరకు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. అధిక ఉత్పత్తి,  ఆర్థిక సాధికారత కోసం రైతులు పలు రకాలుగా పలు అంశాలను తెలుసుకుని తమ సాగుబడిని చేస్తున్నారు.  కానీ,   రసాయనిక ఎరువులు, మందులు వాడటం వల్ల   కలిగే నష్టాలు,  దుష్పరిణామాలు రైతులకు నిజంగా  తెలియవు. కాబట్టి రైతులకు సరైన అవగాహన కల్పించి వారిని ఒప్పించి  భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలతోపాటు పౌర సమాజం,  తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. వ్యవసాయ  ఉత్పత్తి విధానాలను నియంత్రించడానికి ఇప్పుడు ప్రభుత్వాలు ఒక ఖచ్చితమైన పాలసీలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.   రైతుల  పంట ఉత్పత్తి బాగుండాలి  ఇంకోవైపు భూమి ఆరోగ్యం కూడా కాపాడుకునే విధంగా పాలసీలు ఉండాలి.  

పశు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి

రసాయనిక ఎరువులు, మందుల వాడకాన్ని తగ్గిస్తూ  పశువుల పేడ,  మూత్రం,  జీవాల(  గొర్రెలు, మేకలు) ఎరువు  భూమిలో   వేస్తూ భూసారాన్ని, ప్రకృతిని కాపాడుకుంటూ వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి పలు ప్రోత్సాహకాలు అనగా సబ్సిడీలు,  రుణాలు,  పంట ఉత్పత్తులకు లాభసాటి ధర  కల్పించడం మొదలైనవి చేయాలి.  

వ్యవసాయ రంగంలో   మెకనైజ్డ్   పద్ధతులు ప్రవేశపెట్టిన తర్వాత  నాగలిని వదిలి  ట్రాక్టర్​తో పంట భూమిని  భూమి లోతుకు   దున్నడం వల్ల  భూమి పొరల్లో భూసారం పోవడమే కాకుండా  పంటల్లో అధిక గడ్డి పెరుగుతుంది.  మళ్లీ ఈ గడ్డిని తొలగించడానికి  రైతులు గడ్డి మందులను ఉపయోగిస్తున్నారు.  దీనివల్ల  గడ్డి తో పాటు భూమిలో ఉపయోగకరంగా ఉన్న సూక్ష్మజీవులు నశిస్తున్నాయి.

- కత్తెరసాల శ్రీనివాస్,సీనియర్ రీసెర్చ్​ఫెలో, ఉస్మానియా యూనివర్సిటీ‌‌-